Cricket: 242 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా... దుమ్మెత్తి పోస్తున్న అభిమానులు!
- ఒకప్పుడు ఐదుసార్లు చాంపియన్
- ఇప్పుడు ఆరోస్థానానికి దిగజారిన ఆస్ట్రేలియా
- ఇంగ్లండ్ తో ఓటమిపై విమర్శల వర్షం
ఆస్ట్రేలియా... ఐదు సార్లు ప్రపంచ చాంపియన్. కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ క్రికెట్ చరిత్రలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన జట్టు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వరుస వైఫల్యాలు, బాల్ ట్యాంపరింగ్ వివాదాలు, మైదానంలో ఆటగాళ్ల తిట్లపై విమర్శలతో కుదేలై మూడున్నర దశాబ్దాల తరువాత ఆరో స్థానానికి దిగజారింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరం కావడం, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోవడం, పీటర్ బ్యాన్ క్రాఫ్ట్ పై నిషేధంతో ఆ జట్టు ఆటగాళ్లలో మానసిక స్థైర్యం తగ్గిపోయింది.
ఇక తాజాగా, నిన్న జరిగిన వన్డే పోరులో ఇంగ్లండ్ తో తలపడి 242 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియాపై ఆ దేశ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆస్ట్రేలియా ఫీల్డర్ల కన్నా బంతిని మైదానంలోని ప్రేక్షకులే ఎక్కువగా ఆపారని ఎద్దేవా చేస్తున్నారు. తమ జట్టును మోస్ట్ చాలెంజింగ్ జట్టుగా చూసిన కళ్లతో ఇప్పుడిలా థర్డ్ గ్రేడ్ జట్టుగా చూడలేకపోతున్నామని వాపోతున్నారు. ఓడిపోవడాన్ని తట్టుకోవచ్చుగానీ, ఇలా ఓడిపోవడాన్ని తట్టుకోలేమని అంటున్నారు. ఆస్ట్రేలియా జట్టు తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టుల వర్షాన్ని కురిపిస్తున్నారు.