Jammu And Kashmir: సమయం చూసి దెబ్బకొట్టిన బీజేపీ... లోక్ సభ ఎన్నికలకు ముందు జమ్మూ కశ్మీర్ ఎన్నికలు లేనట్టే!
- ఆరు నెలలపాటు సాగనున్న గవర్నర్ పాలన
- ఆపై రాష్ట్రపతి పాలనకే అవకాశాలు
- పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు
- అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు
జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న బీజేపీ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదని, ఎంతో ముందస్తు ప్రణాళికతో తీసుకున్న నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమయం చూసి బీజేపీ దెబ్బకొట్టిందని, 2019 సార్వత్రిక ఎన్నికలలోగా, రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన (గవర్నర్ పాలన అనేది జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకం) ను కొనసాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ఆరు నెలల సమయం ముగిసేటప్పటికి డిసెంబర్ నెల వచ్చేస్తుంది. ఆపై మరో ఆరు నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన తరువాత, రాష్ట్రపతి పాలన విధిస్తారే తప్ప, ఎన్నికలకు కేంద్రం వెళ్లబోదని చెబుతున్నారు.
ఇక రాష్ట్ర అసెంబ్లీలో మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఏకోశానా కనిపించడం లేదు. మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, మెజారిటీకి కావాల్సిన స్థానాలు 44. పీడీపీ 28, బీజేపీ 25, నేషనలిస్ట్ కాంగ్రెస్ 15, కాంగ్రెస్ 12, ఇతరులు 7 స్థానాలను గత ఎన్నికల్లో దక్కించుకోగా, పీడీపీ, బీజేపీ కలసి సంకీర్ణాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి విడిపోవడంతో, కాంగ్రెస్ పార్టీతో పీడీపీ కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. బీజేపీతో ఎన్సీ కలిసినా అదే పరిస్థితి. ఏవైనా మూడు పార్టీలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేగానీ అది జరగడం అసాధ్యం.