aravind subramanian: కేంద్ర ఆర్ధిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా!
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
- కుటుంబపరమైన కారణాలతో అరవింద్ రాజీనామా చేశారు
- ఇందుకు అంగీకరించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు
కేంద్ర ఆర్థికశాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు. కుటుంబపరమైన కారణాలతో తన పదవికి అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారని, కొన్ని రోజుల క్రితం ఆయన తనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారని, తిరిగి అమెరికా వెళ్లిపోవాలని ఆయన అనుకుంటున్నట్టు తనతో చెప్పారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
కుటుంబ కారణాల రీత్యానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు అంగీకరించడం తప్ప వేరే మార్గం తమకు కనిపించలేదని జైట్లీ తెలిపారు. కాగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా 2014 అక్టోబరు 16న మూడేళ్ల కాలానికి అరవింద్ సుబ్రమణియన్ ని నియమించారు. గత ఏడాది ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, అరుణ్ జైట్లీ ఆయనను మరికొంత కాలం ఉండాల్సిందిగా కోరారు. దీంతో ఓ ఏడాది పాటు ఆయన పదవీకాలం పొడిగించారు. అరవింద్ సుబ్రమణియన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్, డీఫిల్ పూర్తి చేశారు.