cuddapah: బలిదానాలు చేస్తేనే ఉక్కు పరిశ్రమ ఇస్తారా?: ఏపీ మంత్రుల ఫైర్
- కేంద్రంపై మండిపడ్డ మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, సుజయకృష్ణ
- కేంద్రం కుంటిసాకులు వెతుకుతోంది
- మెకాన్ నివేదిక బయటపెట్టాలని డిమాండ్
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ ఉక్కు ఉద్యమం మాదిరిగా బలిదానాలు కోరుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్ నాథ్ రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు మండిపడ్డారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావుతో కలిసి మంత్రులు మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై కేంద్రం కుంటిసాకులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. బలిదానాలకు తావులేకుండా పార్లమెంట్ లో చేసిన పునర్విభజన చట్టాన్ని అనుసరించి తక్షణమే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే దుర్బుద్ధిని మానుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు హితవు పలికారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అమర్ నాథ్ రెడ్డి అన్నారు. తప్పంతా ఏపీదేనంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తోందని, ఎన్డీయే హయాంలో టీడీపీ ఉన్నంత వరకూ కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు సైతం ప్రకటిస్తూ వచ్చారని అన్నారు. తాము ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తర్వాత రాయలసీమ డిక్లరేషన్ ను బీజేపీ నేతలు ప్రకటించారని, అసలు, ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడే హక్కు వారికి లేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది జనవరి 6న మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కడపకు వచ్చి, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని పరిశీలించిందని, 7,8 తేదీల్లో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రవాణా ఇలా అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని అమర్ నాథ్ రెడ్డి ప్రస్తావించారు. ఈ నెల 9 తేదీన ఇందుకు సంబంధించిన వివరాలు టాస్క్ ఫోర్స్ కు అందజేశామని, ఇంత చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పటికీ ఏపీ ప్రజల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లాభదాయకం కాదంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని, 2014 తరువాత స్టీల్ రేట్లు 40 నుంచి 60 శాతం వరకూ పెరుగుతూ వచ్చాయని, ప్రైవేటు రంగంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎందరో పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి తమ నిజాయతీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రజలపై బీజేపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. బీజేపికి ఓట్లు, సీట్లు రావనే ఉద్దేశంతోనే ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
మెకాన్ నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదు?
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సుజయ కృష్ణ రంగారావు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు లాభాదాయకం కాదని సెయిల్ చెప్పిందనే విషయం నిజం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, గత ఏడాది డిసెంబర్ 17న సమావేశమైందని చెప్పారు.
ఢిల్లీలో జరిగిన మొదటి సమావేశానికి తనతో పాటు అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీఐఐసీ చైర్మన్, మైన్స్ సెక్రటరీ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. ఉక్కు పరిశ్రమను కడపలో ఏర్పాటు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపామని చెప్పారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన 130 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ అందుబాటులో ఉందని, భూమి, నీరు, విద్యుత్ వంటి రాయితీలు కూడా అందిస్తామని చెప్పామని అన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని అన్నారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు లాభదాయకమేనని కేంద్ర ప్రభుత్వానికి మెకాన్ నివేదిక ఇచ్చిందని, డిసెంబర్ 17న సమావేశమైన టాస్క్ ఫోర్స్ మళ్లీ ఆరు నెలల తరువాత జూన్ 12న భేటీ అయిందని అన్నారు. రెండు సమావేశాలకు మధ్య ఇంత కాలం ఎందుకు సమయం తీసుకున్నారని సుజయ కృష్ణ రంగారావు ప్రశ్నించారు. మెకాన్ ఇచ్చిన నివేదికను కాకుండా సెయిల్ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అందజేయడం సరికాదని, మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. బలిదానాలు జరగక ముందే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని అమర్ నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు డిమాండ్ చేశారు.