buggana: బుగ్గనపై చర్యలు తీసుకునే వరకూ వెనక్కి తగ్గం: టీడీపీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి
- బుగ్గన వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతాం
- లాగ్ బుక్ ను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు
- బుగ్గన చేస్తున్న ఆరోపణలు అబద్ధం
పీఏసీ చైర్మన్ గా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో రాంమాధవ్ నివాసానికి వెళ్లిన విషయం లాగ్ బుక్ లో స్పష్టంగా ఉందని, ఆకుల సత్యనారాయణ, బుగ్గన కలిసి కారులో ప్రయాణించిన విషయం సంబంధిత విజువల్స్ లో చక్కగా కనపడుతోందని అన్నారు.
సంబంధిత సమాచారాన్ని వెల్లడించిన డ్రైవర్ తమ పార్టీ కార్యకర్త కాదని, ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన బుగ్గన వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామని, సభను స్తంభింపజేస్తామని చెప్పారు. ఈ కారణంగానే బుగ్గనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చామని చెప్పారు. ఏపీ భవన్ లాగ్ బుక్ ను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈ విషయమై బుగ్గన చేస్తున్న ఆరోపణలు అబద్ధమని అన్నారు.