rain: వర్షాలు పడుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి: ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు
- ఖరీఫ్ కూడా ప్రారంభమైంది
- త్వరితగతంగా సోలార్ పంపు సెట్ల పంపిణీ
- వ్యవసాయానికి విద్యుత్తు ఆటంకం కలుగకుండా చర్యలు
- మరింత వేగవంతంగా విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు
'వర్షాకాలం వచ్చింది.. ఖరీఫ్ కూడా ప్రారంభమైంది... విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి చెట్లు పడిన చోట్ల తక్షణమే విద్యుత్ పునరుద్ధరించి, వ్యవసాయానికి కరెంట్ ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోండి' అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. విద్యుత్ శాఖ భూములను గుర్తించి, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నంలో చేపట్టిన భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
'24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు ఎన్టీఆర్ జలసిరి కింద సోలార్ పంపు సెట్ల కోసం ఇంత వరకూ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎందరిని అర్హులుగా గుర్తించి, ఎన్ని సోలార్ పంపు సెట్లు అందజేశారు?' అని కళా వెంకటరావు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యంలోగా పంపు సెట్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, వర్షాకాలం కావడంతో ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయి, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదముందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కింద స్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. ఎక్కడయినా చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడితే, తక్షణమే సమీప ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలన్నారు.
మరమ్మతులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధిస్తామని ప్రకటించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు నాయీ బ్రాహ్మణులకు, హార్టీకల్చర్ కు ప్రభుత్వం 75 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తోందన్నారు. బిల్లులు ఇచ్చేటప్పుడు ఇదే విషయమై దాంట్లో పొందుపర్చాలన్నారు. 5,594 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు రాగా, 1,319 కనెక్షన్లు మంజూరు చేశామని, మిగిలిన 3,255 కనెక్షన్లను నెల రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రికి అధికారులు వివరించారు.
వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లను త్వరితగతంగా మంజూరు చేయాలని కళా వెంకటరావు ఆదేశించారు. ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో చేపట్టిన బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ పంపు సెట్ల పంపిణీ తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పంపు సెట్ల వినియోగం వల్ల ప్రభుత్వానికి కూడా రైతులు విద్యుత్ ను విక్రయించే అవకాశం ఉందన్నారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ పంపు సెట్ల వినియోగంపై సవరవిల్లి గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.