Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెరుగుతున్న గుండె ముప్పు!
- ఏపీలో అత్యధికంగా 19 శాతం మందికి..
- తెలంగాణలో 16 శాతం మందికి గుండె ముప్పు
- ఆందోళనకు గురిచేస్తున్న అధ్యయనం
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ ప్రజలకు గుండె ముప్పు అధికంగా పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. దేశవ్యాప్తంగా 2012 నుంచి 2014 మధ్య వివిధ వయసున్న 7.97 లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడైనట్టు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు. వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రజల జీవన విధానం, పనుల ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి.
కార్డియో వాస్క్యులర్ డిసీజ్‌గా పేర్కొనే ఈ జబ్బులు రాష్ర్టాల వారీగా వివిధ స్థాయులలో పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో 15-16 శాతం మంది ప్రజలు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో అత్యధికంగా 18-19 మంది గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. జార్ఖండ్, కేరళలలో మాత్రం అది 13.2-19.5 మధ్య నమోదైంది.