KTR: కారు నంబర్ ప్లేట్ లో 'కేటీఆర్'... ఫిదా అయిన మంత్రి!
- కారు నంబర్ ప్లేట్ లో 'కేటీఆర్'
- ట్విట్టర్ లో చూసిన మంత్రి
- అభిమానానికి ముగ్ధుడై నమస్కార ఎమోజీ
తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వ్యక్తి. తాను చేసిన పనిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను ఫిదా చేశాడు కూడా. ఇంతకీ ఏం చేశాడంటారా? మారుతి సుజుకి సంస్థకు చెందిన కారును కొనుగోలు చేసిన సదరు కేటీఆర్ వీరాభిమాని, దాని నంబర్ ప్లేట్ లో 'కేటీఆర్' అన్న అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో దాన్ని రిజిస్టర్ చేయించాడు.
'టీఎస్ 11 కే టీఆర్ 5343' నంబర్ ను కారుకు లభించేలా చూసుకుని, దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ, కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. "కేటీఆర్ గారు... మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు" అని క్యాప్షన్ పెట్టాడు. ఇది కేటీఆర్ దృష్టికి రావడంతో, అతని అభిమానానికి ఫిదా అయిన కేటీఆర్, 'నమస్కారం' చేసే ఎమోజీని ఉంచారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, 'టీఎస్ 11 కే' సిరీస్ లో రిజిస్టర్ అయ్యే కమర్షియల్ వాహనాలన్నింటికీ పక్కనే 'టీఆర్' ఉంటుంది. అంటే సుమారు 9,999 వాహనాల నంబర్ ప్లేట్లలో 'కేటీఆర్' అన్న అక్షరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.