Amaravathi: అమరావతిలో జూపార్క్.. 251 ఎకరాల్లో ఏర్పాటు
- జూపార్క్ కోసం అనువైన స్థలాన్ని గుర్తించిన అధికారులు
- బొటానికల్ గార్డెన్ కూడా ఉంటే బాగుంటుందన్న చంద్రబాబు
- పలు అభివృద్ధి పనులపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 251 ఎకరాల్లో జంతుప్రదర్శన శాల ఏర్పాటు కాబోతోంది. తాడేపల్లి కొండలపై ఏర్పాటు చేయనున్న జూపార్క్ కోసం ఇప్పటికే అనువైన స్థలాన్ని గుర్తించారు. అమరావతిలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి సమీక్షించారు. ఉండవల్లిలో జరిగిన సమీక్షలో సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో జూపార్క్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించిన విషయాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చి ప్రతిపాదనను అందజేశారు.
లక్ష్మీపార్థసారథి ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. జూతోపాటు బొటానికల్ గార్డెన్‌ను కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. అరుదైన వృక్ష, జంతుజాతులను పరిశీలించే అద్భుతమైన అవకాశం ప్రజలకు లభిస్తుందని చెప్పారు. అలాగే మరిన్ని ప్రతిపాదనలు కూడా సమీక్షలో చర్చకు వచ్చాయి. కృష్ణానది కరకట్టను నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడం, పరిపాలన నగరంలో నిర్మించతలపెట్టిన ఐకానిక్ టవర్లు వంటి విషయాలు కూడా చర్చకు వచ్చాయి.