Ganta Srinivasa Rao: అలిగిన గంటాకు చంద్రబాబు ఫోన్... మనసులో ఏమీ పెట్టుకోవద్దని బుజ్జగింపు!
- గంటా పనితీరు బాగోలేదని మీడియాలో కథనాలు
- వాటిని చూసి అసంతృప్తికి గురైన గంటా
- తన పనితీరు కూడా బాగోలేదని రాశారన్న చంద్రబాబు
- పట్టించుకోకుండా పని చేసుకు పోవాలని సూచన
"పత్రికల్లో రకరకాల సర్వేలు వేస్తుంటారు. వాటిని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. నా పనితీరు కూడా బాగోలేదని వచ్చిందిగా. ఏదీ మనసులో పెట్టుకోవద్దు" అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అనునయించారు. తన నియోజకవర్గమైన భీమిలిలో సక్రమంగా పనిచేయడం లేదని, ఆయన వెనుకబడిపోయారని ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలతో తీవ్ర అసంతృప్తికి లోనైన గంటా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.
రాజకీయాల్లో ఉంటే, ఎన్నో విషయాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయని, ఏవేవో సర్వేలు చేస్తుంటారని, అవన్నీ పట్టించుకుంటే, తాను సైతం ఒక్క పని కూడా చేయలేనని అన్నారు. వీటిని ఫీడ్ బ్యాక్ గా తీసుకుని ముందడుగు వేయాలని గంటాకు సూచించిన చంద్రబాబు, అలా ముభావంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు. కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, వెంటనే ఈ అసంతృప్తి నుంచి బయటపడి, రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సలహా ఇచ్చారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా గంటా వివరణ ఇస్తూ, తనను టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని వాపోయినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ముఖ్యమంత్రికన్నా ముందు గంటా వియ్యంకుడు, మరో మంత్రి నారాయణ సైతం ఆయనకు ఫోన్ చేసినట్టు సమాచారం.