Chandrababu: టెన్షన్ లో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పెరుగుతున్న బీపీ!
- టికెట్ దక్కుతుందో, లేదో అనే ఆందోళన
- కార్యకర్తల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
- ఇతరులకు టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందనే భావన
తెలుగుదేశం పార్టీలో టికెట్ టెన్షన్ మొదలైంది. 40 మంది ఎమ్మెల్యేలకు... వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో, లేదో అనే ఆందోళన నిద్ర లేకుండా చేస్తోంది. పార్టీ అంతర్గతంగా నిర్వహిస్తున్న సర్వేలు, మీడియాలో లీక్ అవుతున్న వార్తలు వారిలో బీపీ లెవెల్స్ ను అమాంతం పెంచేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై ఆయా నియోజకవర్గాల ఓటర్లలో సంతృప్తి ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో, సిట్టింగ్ ఎమ్మల్యేలను కాదని ఇతరులకు టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందనే అభిప్రాయంలో కార్యకర్తలు ఉన్నారు.
మరోవైపు చంద్రబాబు కూడా ప్రతి రోజు దాదాపు ఐదు గంటల సమయాన్ని పార్టీ కోసం కేటాయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలపై కార్యకర్తల్లో వ్యతిరేకత ఉన్నట్టు ఆయన దృష్టికి వెళ్లింది. తాను పలుమార్లు హెచ్చరించినప్పటికీ... పనితీరును మార్చుకోని ఈ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం ఎవరనే విషయంపై కూడా చంద్రబాబు లోతుగా విశ్లేషిస్తున్నారు. దీంతో, చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో అనే ఆందోళన ఎమ్మెల్యేలలో నెలకొంది.