Rajinikanth: 'కాలా' ఫ్లాప్ కావడానికి రజనీకాంతే కారణం: హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్
- తూత్తుకుడిపై రజనీ చేసిన వ్యాఖ్యలే పరాజయానికి కారణం
- సినిమాలు వేరు, రాజకీయాలు వేరు
- విజయ్ ను రాజకీయాల్లోకి రావద్దని చెప్పడానికి ఇదే కారణం
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' బాక్సాఫీసు వద్ద నిరాశపరచినట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తమిళ హీరో విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు, నటుడు అయిన ఎస్ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలే సినిమా పరాజయం కావడానికి కారణమని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే ప్రజలు ఆందోళన బాట పడుతున్నారని అన్నారు.
కొత్తగా పార్టీలు ప్రారంభించిన వారు సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే విషయాన్ని గ్రహించేలోపలే... వారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చంద్రశేఖర్ చెప్పారు. సమాజంలో జరుగుతున్న సమస్యల ఆధారంగా సినిమాలు తీయడం ఒక నటుడి బాధ్యత అని... ప్రజా సమస్యల ఆధారంగానే రజనీ 'కాలా' సినిమాను తీశారని... అయితే తూత్తుకుడి ఆందోళనలపై రజనీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ చిత్రాన్ని పరాజయంపాలు చేశాయని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర గందరగోళం నెలకొందని... అందుకే తాను తన కుమారుడు విజయ్ ను రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉంచానని చెప్పారు.