car parking: బెంగళూరులో ఇంట్లో పార్కింగుకు జాగా ఉంటేనే కారు కొనే అవకాశం.. త్వరలో నిబంధన !
- నిబంధన తీసుకురానున్నట్టు చెప్పిన కర్ణాటక రవాణా మంత్రి
- ప్రస్తుతం చర్చల దశలో
- ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమల్లోకి తెస్తామని ప్రకటన
ఇంటి ఆవరణలో కారు పార్క్ చేసుకునేందుకు స్థలం చూపించకపోతే బెంగళూరు వాసులు త్వరలో కారు కొనే అవకాశం ఉండకపోవచ్చని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖా మంత్రి తమ్మన్న తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందన్నారు. అమలుకు నిర్ణీత గడువు ఏదీ నిర్ణయించలేదన్నారు.
‘‘చాలా వరకు ప్రైవేటు వాహనాలు రోడ్లపై నిలిపివేస్తుండడం కనిపిస్తోంది. ట్రాఫిక్ కు ఇది ఇబ్బందిగా మారింది. రోడ్లన్నవి ప్రజలందరి కోసం. వ్యక్తులకు సంబంధించినవి కావు. మా నూతన ప్రతిపాదన ప్రజల్ని కారు కొనే విషయంలో నిరుత్సాహ పరిచి, ప్రజా రవాణా వినియోగంపై నడిపిస్తుంది’’ అని తమ్మన్న పేర్కొన్నారు.
నగరంలో కార్లు పెరిగిపోతుండడం పార్కింగ్ సమస్యకు దారితీస్తోందని చెప్పారు. ఈ నిబంధన అమలు చేయడానికంటే ముందు దానిపట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దీన్ని ప్రజలు ఆమోదిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఇప్పటి వరకు దేశంలో ఏ నగరంలోనూ ఈ తరహా నిబంధన అమల్లో లేదు.