tg venkatesh: టీజీ వెంకటేష్ పై టీఆర్ఎస్ నేతలు నాయిని, కేకే, కర్నె ఫైర్
- ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వకపోతే కేసీఆర్ కే నష్టం అన్న టీజీ
- తెలివి లేకుండా మాట్లాడుతున్నారన్న కేకే
- చంద్రబాబు స్పందించాలని నాయిని డిమాండ్
- చిల్లర మాటలు మానుకోవాలన్న కర్నె
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వాలని... లేకపోతే కేసీఆరే ఇబ్బందులు పడతారంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలివిలేకుండా మాట్లాడుతున్నారంటూ టీజీపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని చెప్పారు. ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ ఎన్నడూ వ్యతిరేకించలేదని అన్నారు. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణపై టీజీ వెంకటేష్ మరోసారి అక్కసును వెళ్లగక్కారని అన్నారు. పిచ్చి ప్రేలాపణలు, చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. టీజీలాంటి నేతలను చంద్రబాబు ప్రోత్సహించకూడదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఎంపీ కవిత పార్లమెంటులో గళమెత్తారని గుర్తు చేశారు.