trinamul congress: బీజేపీ మాదిరిగా తృణమూల్ కాంగ్రెస్ ఉగ్రవాద సంస్థ కాదు: మమతా బెనర్జీ
- బీజేపీ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన మమత
- వారు హిందువుల మధ్యా గొడవులు పెడుతున్నారు
- బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలకు గట్టి జవాబు
పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఈ రోజు బీజేపీపై మాటలతో విరుచుకుపడ్డారు. బీజేపీ పశ్చిమబెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలకు ఆమె తీవ్రంగా స్పందించారు. కొందరు టీఎంసీ నేతలు, కార్యకర్తలు కండబలంతో తమను బెదిరిస్తున్నారని ఘోష్ విమర్శించారు. ‘‘వాళ్లని జైలుకి పంపండి. లేకపోతే మేమే వాళ్లతో నేరుగా తలపడాల్సి వుంటుంది. మేమేం చూస్తూ కూర్చోవడం లేదు.. మా కార్యకర్తలను చంపుతున్న బుల్లెట్లను లెక్కిస్తూనే వున్నాం" అంటూ ఘోష్ తీవ్రంగా హెచ్చరించారు.
దీనిపై మమత స్పందిస్తూ... ‘‘బీజేపీ మాదిరిగా మాది మిలిటెంట్ సంస్థ కాదు. వారు కేవలం క్రిస్టియన్లు, ముస్లింల మధ్యే గొడవలు సృష్టించడం లేదు... హిందువుల మధ్య కూడా కొట్లాటలు పెడుతున్నారు’’ అని బెనర్జీ అన్నారు. మరోవైపు తృణమూల్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఈ రోజు ఢిల్లీలోని తృణమూల్ కార్యాలయం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి నిరసన నిర్వహించారు.