Maharashtra: బతికుండగానే చనిపోయాడని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది.. వేరే మృతదేహాన్ని అప్పజెప్పిన వైనం

  • మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • అనారోగ్యంతో ఆసుపత్రికి అవినాశ్‌ దాదాసాహెబ్‌ బగ్వాడే
  • మృతి చెందాడని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పిన సిబ్బంది

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తించి విమర్శలు కొనితెచ్చుకున్నారు. అవినాశ్‌ దాదాసాహెబ్‌ బగ్వాడే అనే 50 ఏళ్ల వ్యక్తిని ఇటీవల కాలేయ వ్యాధి చికిత్స నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు సాంగ్లి సివిల్‌ ఆసుపత్రిలో చేర్పించారు.
 
అయితే, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఆ ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. బగ్వాడే మృతి చెందాడని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే ఆసుపత్రికి వచ్చిన బడ్వాడే కుటుంబ సభ్యులకు.. పోస్టు మార్టం పూర్తి చేసిన ఓ మృతదేహాన్ని అప్పగించారు.

దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన తరువాత అనుమానం వచ్చి ఆ మృతదేహంపై ఉన్న క్లాత్‌ను తీసి చూసిన బంధువులకు అది బగ్వాడే మృతదేహం కాదని తెలిసింది. దీంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి నిలదీశారు.

దీంతో బగ్వాడే ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని వారికి తెలిసింది. బగ్వాడే కుటుంబ సభ్యులకు అందించిన ఆ మృతదేహం ఎవరిదన్న విషయం కూడా గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.    

  • Loading...

More Telugu News