New Delhi: ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పరిస్థితి ఏంటి? తాజా సర్వే ఏమంటోంది?
- ఆప్-బీజేపీ హోరాహోరీ
- ఒక్క శాతం ఓట్లతో ఆప్ మందంజ
- గత ఎన్నికల కంటే భారీగా తగ్గనున్న ఆప్ ఓట్ల శాతం
ఢిల్లీ శాసన సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార ఆప్-ప్రతిపక్ష బీజేపీల పరిస్థితి ఏంటి? గెలుపు ఎవరిది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? అన్న దానిపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వేలో తేలింది. బీజేపీ కంటే ఆప్‌కు ఒక్కశాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌కు 39 శాతం, బీజేపీకి 38 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఢిల్లీలో ఆదరణ పెరిగిందని సర్వే పేర్కొంది.
2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 54.3 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడా ఓట్ల శాతం 39 శాతానికి పడిపోనుంది. అలాగే, గత ఎన్నికల్లో బీజేపీకి 32.3 శాతం ఓట్లు రాగా, అది 38 శాతానికి పెరగనుంది. కేజ్రీవాల్ పనితీరుపై 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది బాగాలేదని తేల్చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పనిచేయకుండా ప్రధాని మోదీ ఆటంకాలు సృష్టిస్తున్నారని 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోక్‌సభకు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీకే ఓటేస్తామని 40 శాతం ఢిల్లీ ఓటర్లు చెప్పడం గమనార్హం.