Kachiguda: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం!
- విరుచుకుపడిన 12 మంది దొంగలు
- 9 బోగీల్లో స్వైరవిహారం
- గుత్తి స్టేషన్ లో ప్రయాణికుల ఫిర్యాదు
నిన్న రాత్రి చిత్తూరు నుంచి కాచిగూడ బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. రైలు సిగ్నల్ కేబుల్స్ ను కట్ చేయడం ద్వారా రైలు ఆగేలా చేసిన దొంగలు, రైల్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి నగదు, నగలు, విలువైన వస్తువులను అపహరించారు. పక్క బోగీలోనే పోలీసులు ఉన్నా విచ్చలవిడిగా దోపిడీ చేశారు. తమకు ఎదురు తిరిగిన వారిని చావగొట్టారు. కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేశారు.
మొత్తం 9 బోగీల్లో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో 12 మంది దొంగలు పాల్గొన్నారని, పోలీసులు లేని బోగీలను ముందుగానే ఎంచుకుని, రైలు ఆగిన నిమిషాల్లోనే పని ముగించుకుని చీకట్లోకి పారిపోయారని ప్రయాణికులు వాపోయారు. అందరూ 20 సంవత్సరాల్లోపు వారేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ సమీపంలో కూడా సిగ్నల్ ను పనిచేయకుండా చేసిన దొంగలు దోపిడీకి దిగగా, అదే గ్యాంగ్ ఈ ఘటనలోనూ పాల్గొని ఉండవచ్చన్న కోణంలో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది.