TANA: టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ పై స్పందించిన తానా అధ్యక్షుడు!
- హీరోయిన్లను సాంస్కృతిక కార్యక్రమాలకు పిలుస్తాం
- కార్యక్రమం తరువాత వారు ఏం చేస్తారో తెలియదు
- వ్యభిచారం జరిగిందంటున్న రోజుల్లో తానా ఎవరినీ ఆహ్వానించలేదు
- స్పష్టం చేసిన తానా అధ్యక్షుడు వేమన సతీష్
అమెరికాకు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట వచ్చి వ్యభిచారం నిర్వహించిన తెలుగు హీరోయిన్లకు, తమకు ఎటువంటి సంబంధమూ లేదని తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అధ్యక్షుడు వేమన సతీష్ వ్యాఖ్యానించారు. మోదుగుమూడి కిషన్ దంపతులు సాగించిన ఈ దందాతో తెలుగు సంఘాలకు ఎటువంటి కనెక్షన్ లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అమెరికాలోని తెలుగువారిని ఒకటి చేసేలా పలు కార్యక్రమాలు చేస్తుంటామని, ఇందుకోసం సినీ తారలను ఆహ్వానించడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోందని స్పష్టం చేసిన ఆయన, ఇక్కడికి వచ్చి కార్యక్రమం ముగిసిన తరువాత వారు ఏం చేస్తారన్న విషయం తమకు తెలియదని వెల్లడించారు.
తెలుగు సంఘాల ప్రతినిధులను ఫెడరల్ పోలీసులు విచారిస్తున్నారని, వారికి తామంతా పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఒకరిద్దరు చేసిన తప్పుడు పనితో తెలుగు సంఘాలన్నింటికీ సంబంధం అంటగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తనను ప్రశ్నించాలని మే 8న పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఆ వెంటనే తాను వారికి ఫోన్ చేయగా, "ఫలానా తేదీల్లో ఎవరికైనా ఆహ్వానాలు పంపారా?" అని అడుగగా తాను లేదని చెప్పానని, అదే విషయాన్ని ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో పోలీసులు పొందుపరిచారని తెలిపారు. తనపై ఏపీలో రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలతో బాధ కలిగిందని చెప్పారు. తానాపై బురద జల్లవద్దని కోరారు.