musharraf: నన్ను అరెస్ట్ చేయించాలనేదే సుప్రీంకోర్టు ప్లాన్.. నేను పిరికివాడిని కాదు: ముషారఫ్
- నన్ను అరెస్ట్ చేయించేందుకే సుప్రీంకోర్టు సందేశం పంపింది
- ఇప్పట్లో నేను పాకిస్థాన్ కు రాలేను
- నా నామినేషన్ పత్రాలను తిరస్కరించారు
తనకు పాకిస్థాన్ కు రావాలనే కోరిక ఉన్నప్పటికీ... ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అన్నారు. సైన్యాధ్యక్షుడిగా పని చేసిన మీకు భయం ఎందుకు? అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ... తాను పిరికివాడిని కాదనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. త్వరలోనే పాకిస్థాన్ కు వస్తానని తెలిపారు. కోర్టు ముందు హాజరైన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముషారఫ్ ను అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సకిబ్ నజీస్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ముషారఫ్ స్పందిస్తూ... తనను స్వదేశానికి రప్పించి, ఆ తర్వాత అరెస్ట్ చేయడానికే సుప్రీంకోర్టు ఈ సందేశాన్ని పంపిందని అన్నారు.
ఆల్ పాకిస్థాన్ ముస్లింలీగ్ తరపున రెండు స్థానాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించానని... అయితే ఎన్నికల అధికారి వాటిని తిరస్కరించారని ముషారఫ్ చెప్పారు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముషారఫ్ 2016లో దేశం నుంచి పారిపోయి... దుబాయ్ లో తలదాచుకుంటున్నారు.