malakondaiah: ఏపీ డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు
- ఓ కేసుకు సంబంధించి మహిళను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
- హైకోర్టును ఆశ్రయించిన నిందితురాలి కుమారుడు
- నిందితులు, అనుమానితులను మీడియా ముందు ప్రవేశపెట్టే హక్కు పోలీసులకు లేదన్న కోర్టు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఓ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలివేలు అనే మహిళను డీఎస్పీ మాధవరెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారం పట్ల ఆమె కుమారుడు సాగర్ కలత చెందాడు. తన తల్లిని మీడియా ముందు ప్రవేశపెట్టడం సరికాదంటూ హైకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు... నిందితులను, అనుమానితులను మీడియాకు చూపే హక్కు పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది. ఏ అధికారంతో నిందితురాలిని మీడియా ముందు ప్రవేశపెట్టారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.