Amaravati: ఒకే విగ్రహంలో పది అవతారాలు... నేడు ప్రతిష్టించబడిన దశావతార విగ్రహ వర్ణన!
- ఆకర్షిస్తున్న దశావతార విగ్రహం
- మహా విష్ణువు 10 అవతారాలతో విగ్రహం
- నేడు అత్యంత వైభవంగా ప్రతిష్టాపన
నేడు లింగమనేని టౌన్ షిప్ లో ప్రతిష్టించబడిన దశావతార విగ్రహం భక్తులను తొలిరోజే విశేషంగా ఆకర్షిస్తోంది. లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 21 అవతారాలను ఎత్తగా, వాటిల్లో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. పదవ అవతారమైన కల్కి, కలియుగంలో అవతరించాల్సివుంది. దశావతారాల్లో విడివిడిగా అన్ని అవతారాలకూ దేవాలయాలు ఉన్నా, అత్యధికంగా నారసింహావతారం, కృష్ణావతారం, రామావతారం, వెంకటేశ్వర అవతారాలకు సంబంధించిన దేవాలయాలే అత్యధికం. మిగతా అవతారాలకు ఉన్న దేవాలయాల సంఖ్య చాలా స్వల్పమే.
మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, వెంకటేశ్వరావతారము, కల్కి అవతారాలు దశావతారాలు కాగా, అన్ని అవతారాలనూ శ్రీ వెంకటేశ్వరుని రూపంలోకి తీసుకు వచ్చినదే ఈ దశావతార విగ్రహం.
ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామి పాదాలతో కనిపిస్తుంది. మోకాళ్ల వరకూ మత్స్యావతారం, ఆపై నడుము వరకూ కూర్మావతారం కనిపిస్తాయి. శ్రీ వెంకటేశ్వరుని ముఖం, మరో రెండు ముఖాలుగా నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖ విగ్రహమిది. ఇక ఎనిమిది చేతులతో ఉండే విగ్రహానికి వామనావతారానికి సూచికగా, ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గాన్ని స్వామికి ధరింపజేశారు. విష్ణుమూర్తి ధరించే శంఖు, చక్రాలను మరో రెండు చేతులకు అలంకరించారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన నేడు అంగరంగ వైభవంగా జరిగింది.