ramana dikshitulu: రమణ దీక్షితుల ఆరోపణలు చాలా బాధ కలిగించాయి: టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు
- రమణదీక్షితుల ఆరోపణలు అవాస్తవం
- 2001, 2008 తరహాలోనే పోటులో మరమ్మతులు చేశాం
- ఆలయం నుంచి గుండుసూది బయటకు వెళ్లినా రికార్డవుతుంది
రమణ దీక్షితుల ఆరోపణలు తనకు చాలా బాధ కలిగించాయని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై భక్తులకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
నేలమాళిగల కోసం ఎలాంటి తవ్వకాలు జరపలేదని, రమణదీక్షితుల ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. 2001, 2008 తరహాలోనే పోటులో మరమ్మతులు చేశామని, ఆగమ పండితులు, జీయంగార్ల సూచనలు తీసుకోకుండా అధికారులు పని చేయరని, వకుళామాత పోటులో మరమ్మతులు జరుగుతున్నప్పుడు, ఈశాన్యంలోని పడి పోటులో శాస్త్రోక్తంగా ప్రసాదాలు తయారు చేశామని చెప్పారు. 2017లో కూడా ఆగమపండితులు, జియ్యంగార్ల సూచన మేరకు ప్రసాదం పోటులో ప్రసాదాలు తయారు చేశామని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎలా తప్పవుతుందని అన్నారు.
రమణదీక్షితులు ఒక్కరే కాదని, ఐదుగురు ఆగమ సలహాదారులు ఉన్నారని, నాడు ఆయన ఒప్పుకోకపోవడంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని చెప్పారు. రమణదీక్షితులు అంగీకరించిన పనులనే పోటులో చేశామని, దీక్షితులు చేస్తున్న ఆరోపణలు భక్తుల్లో సందేహాలను పెంచుతున్నాయని, ఆలయం నుంచి గుండుసూది బయటకు వెళ్లినా రికార్డవుతుందని, అలాంటిది, శ్రీవారి ఆభరణాలుఎలా మాయమవుతాయని అన్నారు. ఏడాదికోసారి అర్చకులు, నిపుణుల సమక్షంలో శ్రీవారి ఆభరణాల పరిశీలన, లెక్కింపు జరుగుతాయని శ్రీనివాసరాజు అన్నారు.