Kadiam Srihari: ఈ ఏడాది నుంచే తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభిస్తున్నాం: కడియం శ్రీహరి

  • తెలంగాణలో బాలిక విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాం
  • దేశంలో అత్యధికంగా గురుకులాలు తెలంగాణలోనే
  • గురుకులాల్లో అత్యుత్తమ భోజనం, నాణ్యమైన విద్య
  • 677 కోట్ల రూపాయలతో మధ్యాహ్న భోజనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయని అన్నారు.

ఏటా వీటి కోసం 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి 1,25,000 రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కడియం శ్రీహరి ముంబయిలో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేతో సమావేశమై విద్యారంగంలో ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు.

ఈ సందర్బంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సబ్ కమిటీ చైర్మన్ గా తాను కేంద్రానికి ఇచ్చిన నివేదికలో బాల్య వివాహాలను అరికట్టి, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడిగించాలని ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించడంతో కేజీబీవీలు ఇక దేశవ్యాప్తంగా 12వ తరగతి వరకు విద్యనందించనున్నాయన్నారు.

తెలంగాణలో కూడా ఈ ఏడాది నుంచే ఇంటర్ ప్రారంభిస్తున్నామని కడియం శ్రీహరి చెప్పారు. కేంద్రం సర్కారు కేజీబీవీల్లో 8వ తరగతి వరకే విద్యనందిస్తుండగా తెలంగాణలో మాత్రం కేజీబీవీల్లో 10వ తరగతి వరకు రాష్ట్ర నిధులతో విద్యనందిస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా కేజీబీవీల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా నాణ్యమైన విద్యతో పాటు అత్యంత పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. నెలకు ఆరు సార్లు మాంసాహారం, వారానికి 5 రోజులు గుడ్లు, ప్రతి రోజు భోజనంలో నెయ్యి, ఉదయం రాగి మాల్ట్, రాత్రి గ్లాసు పాలు ఇస్తున్నామన్నారు.

ఆడపిల్లల్లో రక్తహీనతను అధిగమించేందుకు బెల్లంతో తయారు చేసిన పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలు కూడా ఇవ్వాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదే రకమైన పౌష్టికాహారాన్ని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, విద్యా శాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో కూడా అందిస్తున్నట్లు కడియం శ్రీహరి వివరించారు. గురుకుల విధానంలో పనిచేస్తున్న 1,505 విద్యా సంస్థల్లో ఒకే రకమైన భోజనాన్ని, ఏకరూప దుస్తులను, వసతులు, విద్యను, అకాడమిక్ క్యాలెండర్ ను అమలు చేస్తున్నామని చెప్పారు.

గురుకుల విద్యాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని, సీసీ కెమెరాలను పెట్టామని, కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఎక్కువ సీట్లు సాధించే విధంగా విద్యా సంవత్సరం మొదటి నుంచే ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు.

గురుకులాల్లో కూడా డే స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, ఈ భోజనంలో విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నామని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణలో మొత్తం 28,674 పాఠశాలల్లో 25,48,232 మందికి 677 కోట్ల రూపాయలతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News