D.Suresh Babu: రామానాయుడిపై బయోపిక్ ఉండదు: తేల్చేసిన సురేశ్‌బాబు
- బయోపిక్‌లలో కాంట్రవర్సీ లేకపోతే చూడరని వ్యాఖ్య
- మహానటి, సంజు సినిమాలు వేరన్న సురేశ్ బాబు
- ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన లేదన్న నిర్మాత
తన తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడిపై బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని నిర్మాత డి.సురేశ్‌బాబు తేల్చి చెప్పారు. ఆయన నిర్మాణ సారథ్యంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడారు.
సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను రెండుసార్లు సెట్స్‌కి వెళ్లానని, ఆ సమయంలో అంతా సరిగానే సాగుతున్నట్టు గుర్తించానని చెప్పుకొచ్చారు. తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమన్నారు. ‘మహానటి’, ‘సంజు’ వంటి బయోపిక్స్‌కు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాలలో పలు కోణాలను చవిచూశారని సురేశ్ బాబు పేర్కొన్నారు. తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ వినరు, చూడరని వివరించారు. ఇప్పటికైతే ఆయన బయోపిక్ తెరకెక్కించాలన్న ఆలోచన లేదన్నారు.
తమ బ్యానర్లో ఏ సినిమా చేసినా రెండు విషయాలు పక్కాగా ఉంటాయని సురేశ్ బాబు అన్నారు. కొత్త వారిని, కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేస్తామని, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను మరింత నాణ్యంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తరుణ్ భాస్కర్లో ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన ఉందన్నారు.