EB5 VISA: ట్రంప్ తదుపరి లక్ష్యం ఈబీ5 ఇన్వెస్టర్ వీసాలే!... వాటి సంస్కరణ కోసం పట్టు
- ఈబీ5 వీసాలను సంస్కరించాలని అమెరికా కాంగ్రెస్ ను కోరిన ట్రంప్
- లేదంటే వీటిని రద్దు చేయాలని డిమాండ్
- ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు
పొరుగు దేశాల నుంచి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న సమరం మరో మలుపు తీసుకుంది. ట్రంప్ తదుపరి లక్ష్యం ఈబీ5వీసాలపైకి వెళ్లింది. ఈ వీసాలను సంస్కరించాలని లేదంటే పూర్తిగా రద్దు చేసేయాలని డోనాల్డ్ ట్రంప్ అమెరికా చట్ట సభ కాంగ్రెస్ ను కోరారు. ఈబీ5 అన్నది విదేశీ ఇన్వెస్టర్లకు ఇచ్చే వీసా. ఒక మిలియన్ డాలర్లు (రూ.6.8 కోట్ల మేర) అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే వారికి ఈబీ5 వీసా జారీ చేస్తారు. ఇది గ్రీన్ కార్డుతో సమానం. విదేశీయులు ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని, మోసగాళ్లకు ఆయుధంగా మారుతోందంటూ నివేదికలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా స్పందించారు.
ఇక అమెరికా చట్టసభ సభ్యుల్లోనూ కొందరు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలతో ఏకీభవిస్తూ వీటి జారీని వ్యతిరేకిస్తున్నారు. ఈబీ5 రీజినల్ సెంటర్ ప్రొగ్రామ్ ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇన్వెస్టర్లను, వ్యాపారులను మోసాల నుంచి కాపాడుకునేందుకు ఈబీ5 వీసాలను సంస్కరించాల్సి ఉందిని అమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా పేర్కొన్నారు.