ponguleti: తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు వేయట్లేదో సమాధానం చెప్పాలి!: పొంగులేటి సుధాకర్ రెడ్డి
- తెలుగు రాష్ట్రాల మేలుకోరి వ్యాజ్యం వేశాను
- ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా కౌంటర్ అఫిడవిట్ వేసింది
- తమ వెర్షన్‌ను ఏపీ ప్రభుత్వం చెప్పింది
- తెలంగాణ సర్కారు నుంచి స్పందన లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలంటూ టీపీసీసీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆమధ్య సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ వేసింది. దీనిపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు ఫ్యాక్టరీతో పాటు అమలు కాని అన్ని అంశాలతో ఏపీ సర్కారు చక్కగా అఫిడవిట్ వేసిందని అన్నారు. తమ వెర్షన్‌ను స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
తెలంగాణలో అమలుకాని అంశాలను సుప్రీంకోర్టుకు తెలపాలని తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని, ఇంప్లీడ్ అయి బయ్యారం, స్కోచ్ ఫ్యాక్టరీ వంటి అన్ని అంశాలను గురించి వివరించి చెప్పాలని కోరానని తెలిపారు. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని, చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తోందని అన్నారు.
తెలుగు బిడ్డగా రెండు రాష్ట్రాల మేలు కోరుతూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇంతవరకు కేసీఆర్ నోటి నుంచి ఈ విషయంపై ఒక్క మాట కూడా రాలేదని అన్నారు. కౌంటర్ అఫిడవిట్ వేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. పక్క రాష్ట్రంలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై పెద్ద ఎత్తున నిలదీస్తోంటే కేసీఆర్ ఎందుకు నిలదీయట్లేదని ఆయన ప్రశ్నించారు. తాను మరోసారి ఈ విషయంపై తెలంగాణ సర్కారుకి ఈ విషయంపై మెసేజ్ పంపానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు వేయట్లేదో సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.
కాగా, ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర సర్కారు వైఖరిని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని తాము కోరితే, కేవలం రూ.1050 కోట్లు మాత్రమే వచ్చిందని అందులో పేర్కొంది. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7918.40 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్ర సర్కారు ఇప్పటివరకు రూ.5349.70 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పింది.
విభజన హామీల్లో ఏ ఒక్క దానినీ కేంద్ర సర్కారు అమలు చేయలేదని ఏపీ పేర్కొంది. షెడ్యూల్-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11,602 కోట్లతో డీపీఆర్ పంపామని, అయితే రూ.1,500 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపింది. వాటితో పాటు కేంద్ర సర్కారు అమలు చేయని అన్ని అంశాలను ఏపీ సర్కారు పేర్కొంది.