TG Venkatesh: కేకేను కించపరిచారంటూ టీజీ వెంకటేశ్‌పై కేసు
- ఓయూ పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు
- టీజీ దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చారని విమర్శలు
- హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని హెచ్చరిక
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన టీజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కె.కేశవరావును టీజీ విమర్శించడాన్ని నిరసిస్తూ ఓయూ గెస్ట్ హౌస్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ టీజీ వెంకటేశ్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్.. కేకేను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కేకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అనంతరం అందరూ కలిసి వెళ్లి వెంకటేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.