Passport: వివాదాస్పద పాస్ పోర్ట్ అధికారికి ‘సన్మానం’ చేస్తామంటున్న శివసేన!
- పాస్‌పోర్టు కోసం వస్తే అనుచిత ప్రవర్తన
- ముస్లింను పెళ్లాడినా పేరెందుకు మార్చుకోలేదని నిలదీత
- పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరణ
- స్పందించిన సుష్మ.. అధికారి బదిలీ
సంచలనాలకు మారు పేరుగా నిలిచే శివసేన మరోమారు సంచలన నిర్ణయం తీసుకుని కలకలం రేపింది. యూపీలో పాస్‌పోర్టు కోసం వచ్చిన ఓ జంటపై అనుచితంగా ప్రవర్తించి బదిలీ వేటుకు గురైన పాస్‌పోర్టు అధికారి వికాశ్ మిశ్రాను సన్మానించాలని నిర్ణయించింది. అంతేకాక, బదిలీని ఆపాలంటూ యూపీ గవర్నర్ రామ్ నాయక్ మిశ్రాను కలిసి ఆ పార్టీ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
తన్వీ సేథీ అనే మహిళ సిద్ధిఖీ అనే ముస్లిం యవకుడిని పెళ్లాడింది. ముస్లింను పెళ్లాడినా తన్వీ పేరు మార్చుకోకపోవడాన్ని మిశ్రా తప్పుబట్టారు. అంతేకాక, సిద్ధిఖీని హిందూమతం పుచ్చుకోవాల్సిందిగా సూచిస్తూ పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరించారు. తమను అవమానించి, అనుచితంగా ప్రవర్తించిన పాస్‌పోర్టు అధికారిపై మంత్రి సుష్మాస్వరాజ్‌కు తన్వీ ఫిర్యాదు చేశారు. ఆమె జోక్యంతో అధికారులు ఆ జంటకు పాస్‌పోర్టు ఇచ్చారు. వారితో అనుచితంగా ప్రవర్తించిన మిశ్రాను అధికారులు బదిలీ చేశారు.
మిశ్రాను బదిలీ చేయడాన్ని శివసేన వ్యతిరేకించింది. ముస్లింలను సంతృప్తి పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. మిశ్రాను సన్మానిస్తామని ప్రకటించింది.