Tollywood: యూఎస్ వీసా కోసం సురేఖా రాణి దరఖాస్తు... 'ఆటా' పేరు చెప్పగానే రిజక్ట్!
- ఆటా సదస్సు కోసం వెళుతున్నానని చెప్పిన సురేఖా రాణి
- మరో ప్రశ్న వేయకుండానే తిరస్కరించిన యూఎస్ కాన్సులేట్
- నిరాకరణకు గురవుతున్న 90 శాతం దరఖాస్తులు
టాలీవుడ్ పై హీరోయిన్ల సెక్స్ రాకెట్ ప్రభావం పడింది. వివిధ తెలుగు అసోసియేషన్ల ఆహ్వానాలతో అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారు యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలో తిరస్కరణకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం, అంటే 22వ తేదీన అమెరికా వెళ్లేందుకు బీ1బీ2 (ట్రావెల్ వీసా) వీసా నిమిత్తం డ్యాన్సర్, టీవీ నటి సురేఖా రాణి యూఎస్ కాన్సులేట్ కు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్లారు.
అమెరికాకు ఎందుకు వెళుతున్నారని అడుగగా, 'ఆటా సదస్సు కోసం' అని ఆమె చెప్పగానే తిరస్కరణకు గురైంది. ఇదే సభలకు వెళ్లేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి మేక మహేందర్ రెడ్డి పెట్టుకున్న వీసా దరఖాస్తు కూడా తిరస్కరణకు గురైంది. ఇలా వీసాలను తిరస్కరిస్తున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, తానా, ఆటా, నాటా సదస్సులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే వారిలో 75 శాతం మంది వరకూ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలిస్తుంటారని, ఇప్పుడు 90 శాతం మందికి వీసా ఇచ్చేందుకు కాన్సులేట్ నిరాకరిస్తోందని అధికారులు వెల్లడించారు. తెలుగు అసోసియేషన్లు నిర్వహించే సదస్సుల పేరు చెబితే, మరో ప్రశ్న లేకుండానే 'రిజక్టెడ్' స్టాంప్ వేసేస్తున్నారని తెలుస్తోంది.