AC: కేంద్రం కీలక నిర్ణయం... ఇకపై ఏసీల్లో 24 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే!

  • విద్యుత్ ను ఆదా చేయాలని భావిస్తున్న కేంద్రం
  • ఒక్క డిగ్రీని పెంచుకుంటే 6 శాతం విద్యుత్ ఆదా
  • ఆరు నెలల పాటు ప్రజలకు అవగాహన
  • స్పందన బట్టి తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్రం

విద్యుత్ ను మరింతగా ఆదా చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎయిర్ కండిషనర్ మెషీన్లు డిఫాల్ట్ గా 24 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ పై మాత్రమే తయారు చేయాలని, ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య సెట్ చేసుకునే సౌకర్యం మాత్రమే ఉండాలని ఆదేశించింది. 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే, విద్యుత్ బిల్లులపై భారం తగ్గడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం బాగుంటుందని ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

 ఇదే సమయంలో అన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థలూ తమ కార్యాలయాల్లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను మార్చుకోవాలని విద్యుత్ శాఖ నోటీసులను పంపింది. ఆరు నెలల ప్రచారం తరువాత, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను గమనించి, 24 డిగ్రీల డిఫాల్ట్ సెట్టింగ్ ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై ఏసీ తయారీదారుల కంపెనీలతో చర్చించామని అధికారులు తెలిపారు.

ఏసీలో ఒక్క డిగ్రీని అధికంగా పెంచితే 6 శాతం మేరకు విద్యుత్ ఆదా అవుతుందని, సాధారణంగా మానవ శరీరం 35 నుంచి 37 డిగ్రీల సెల్సీయస్ లో ఉంటుంది కాబట్టి 24 డిగ్రీల చల్లదనం హాయిగా ఉంటుందని తెలిపిన విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్, చాలా హోటళ్లు, వాణిజ్య భవనాల్లో 18 నుంచి 21 డిగ్రీల టెంపరేచర్ ను కొనసాగిస్తున్నారని అన్నారు. తక్కువ ధరలకు ఏసీ మెషీన్లు లభిస్తుండటంతో విద్యుత్ కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News