Army Major: ఆర్మీ మేజర్ భార్యను పెళ్లాడాలనుకున్న మరో మేజర్.. తిరస్కరించడంతో గొంతు కోసి హత్య!
- మూడేళ్లుగా మేజర్ భార్యతో స్నేహం
- ఓసారి వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిన శైలజ
- కారులోనే గొంతు కోసి బయటకు విసిరేసిన నిఖిల్
తనను పెళ్లాడేందుకు తిరస్కరించిన ఆర్మీ మేజర్ భార్యను మరో మేజర్ దారుణంగా హత్య చేశాడు. నిందితుడు నిఖిల్ హండా ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. మేజర్ అమిత్ ద్వివేదీ భార్య శైలజ తనను పెళ్లాడేందుకు నిరాకరించడంతోనే ఆమెను నిఖిల్ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. శైలజకు నిఖిల్ పలుమార్లు ఫోన్ చేసినట్టు అతడి కాల్ రికార్డును బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
2015 నుంచి అతడికి శైలజ తెలుసని, అప్పటి నుంచి ఆమెను ఎలాగైనా పెళ్లాడాలని భావించాడని చెప్పారు. అమిత్ ద్వివేదీకి 2015లో నాగాలాండ్‌లో పోస్టింగ్ రావడంతో మేజర్ అఖిల్, శైలజకు మధ్య స్నేహం కుదిరింది. అప్పటికే తనకు పెళ్లయినప్పటికీ, ఆమెపై మనసు పారేసుకున్న నిఖిల్ ఆమెను పెళ్లాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి ఆమె తిరస్కరించినప్పటికీ నిఖిల్ మాత్రం పట్టువదలలేదు. ఓసారి శైలజ, నిఖిల్‌లు వీడియో కాల్లో మాట్లాడుకుంటుండగా అమిత్ చూడడం కూడా జరిగింది. దీంతో వీరిద్దరూ కలుసుకోకుండా జాగ్రత్త పడినట్టు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో అమిత్ కి ఢిల్లీ ట్రాన్స్ ఫర్ కావడంతో కొన్నాళ్ల క్రితం ఈ దంపతులు ఇక్కడికి వచ్చేశారు. ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడిని కలిసేందుకు శనివారం ఢిల్లీ వచ్చిన నిఖిల్.. శైలజకు కాల్ చేశాడు. దీంతో ఆమె నిఖిల్‌ను కలుసుకునేందుకు ఫిజియోథెరపీ సెషన్ పేరుతో ఆసుపత్రికి వెళ్లింది.
శైలజ చివరిసారి నిఖిల్ కారులో కనిపించిందని పోలీసులు తెలిపారు. కారులోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకునేందుకు శైలజ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిఖిల్ కత్తితో కారులోనే ఆమె గొంతు కోశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధిలో విసిరేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు.
అనంతరం ఆసుపత్రికి వెళ్లి, అక్కడి నుంచి సాకేత్‌లోని తన ఇంటికి వెళ్లాడు. టీవీల్లో శైలజ హత్య వార్త వస్తుండడంతో మీరట్ కు వెళ్లిపోవాలని బయలుదేరాడు. వ్యవహారం మొత్తం చల్లబడ్డాక తిరిగి రావాలని భావించినట్టు పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే నిఖిల్ పై అమిత్ అనుమానం వ్యక్తం చేయడంతో, అటుపై దృష్టి సారించిన పోలీసులు.. నిఖిల్ హోండా సిటీ కారులో వెళ్తుండగా మీరట్‌లో వలపన్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నిందితుడిని ఢిల్లీ తీసుకొచ్చారు.