Marriage: పెళ్లి పెద్ద హోదాలో ప్రియురాలికి కన్యాదానం.. ఆపై కాపురాన్ని కూల్చే యత్నం!
- ప్రియురాలిని పెళ్లాడేందుకు వివిధ ప్లాన్లు
- కొడుకులా ఉంటానని నమ్మించి మోసం
- చివరికి కటకటాల్లోకి
ప్రియురాలి కోసం మతం మార్చుకున్నా ప్రియుడి పెళ్లి కల నెరవేరలేదు. పెద్దల ఒత్తిడికి తలొగ్గిన ప్రియురాలు వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైంది. విషయం తెలిసి గుండె చెదిరిన ప్రియుడు సినిమా స్టైల్లో ప్రియురాలికి కన్యాదానం చేశాడు. ఆపై వారిని విడగొట్టేందుకు తప్పుడు మార్గం ఎంచుకుని కటకటాల పాలయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన షేక్ సయ్యద్ వలీ (32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. ఫార్మా కంపెనీని మోసగించిన కేసులో గతేడాది మార్చిలో అతడిపై కేసు కూడా నమోదైంది. ఆ ఘటన తర్వాత వలీ తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. ఎల్బీనగర్లో కన్సల్టెన్సీ తెరిచాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆకర్షించాడు. ఈ క్రమంలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.
వారి పెళ్లికి మతాలు అడ్డుగా నిలిచాయి. అమ్మాయి కుటుంబ సభ్యులతో హిందువులమని చెప్పాలని తన తల్లిదండ్రులను వలీ ఒత్తిడి చేశాడు. దీనికి వారు నిరాకరించారు. దీంతో అతడే తన పేరును అద్వైత రెడ్డిగా మార్చుకున్నాడు. యువతి తల్లిదండ్రులను కలిసి తమ ప్రేమ గురించి చెప్పాడు. పెళ్లికి నిరాకరించిన వారు కల్యాణ్ అనే యువకుడితో కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. విషయం తెలిసిన వలీ కల్యాణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించడంతో పెళ్లి ఆగిపోయింది.
విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వలీని హెచ్చరించారు. మళ్లీ అల్వాల్‌కు చెందిన సంతోష్‌తో అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. సంతోష్, కల్యాణ్ ఇద్దరూ దూరపు బంధువులు కావడంతో మరోమారు ఎంటరైన వలీ కల్యాణ్‌కు ఫోన్ చేసి పెళ్లి ఆపించాలని, తమ ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పాలని బెదిరించాడు. దీతో కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో వలీ మరో కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు. జరిగిన విషయాలను మనసులో పెట్టుకోవద్దని, కొడుకులా ఉంటానని ప్రియురాలి తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు. గతేడాది నవంబరులో జరిగిన ప్రియురాలి పెళ్లిలో అన్నీ తానై వ్యవహరించాడు. ఆమె తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి, కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశాడు.
పెళ్లి తర్వాత తన ప్లాన్‌కు మరింత పదును పెంచాడు. ప్రియురాలి కాపురాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాడు. పెళ్లి జరిగిన రోజే సంతోష్ ప్రొఫైల్‌ను అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేసి మేల్ ఎస్కార్ట్ (పురుష వ్యభిచారి)గా పేర్కొన్నాడు. సంతోష్ ఫొటోను మార్ఫింగ్ చేసి మొబైల్ నంబరు ఇచ్చాడు.
మరోవైపు పెళ్లి చేసుకున్న వలీ ప్రియురాలు కాపురం కోసం నెలరోజుల సమయం అడిగింది. ఆ తర్వాత ఓ రోజు నీ ప్రొఫైల్ అశ్లీల వెబ్సైట్లో ఉందంటూ భర్తకు చెప్పింది. పంచాయితీ పెట్టించి పుట్టింటికి వచ్చేసింది. దీంతో సంతోష్ పోలీసులను ఆశ్రయించగా వలీ లీలలు వెలుగుచూశాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రొఫైల్ అప్లోడ్ విషయంలో యువతి ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. కాగా, ఉద్యోగాల పేరుతో కొందరి నుంచి దాదాపు రూ.4 లక్షలు వసూలు చేసినట్టు మాదాపూర్‌లో కేసు నమోదైనట్టు పోలీసులు వివరించారు.