India: ధోనీ శకంలో పుట్టి పొరపాటు చేశా: పార్థివ్ పటేల్
- ధోనీ కన్నా ముందే భారత జట్టులోకి పార్థివ్
- ఆపై ధోనీ రాకతో జట్టుకు దూరం
- ధోనీ ఓ లెజండ్ అని కితాబు
మహేంద్ర సింగ్ ధోనీ కన్నా ముందు భారత క్రికెట్ జట్టులోకి యువ వికెట్ కీపర్ గా ప్రవేశించి, ఆపై తన స్థానాన్ని ధోనీకి కోల్పోయిన పార్థివ్ పటేల్, ధోనీ రాణించడంతో తన కెరీర్ మొత్తంలో మళ్లీ జట్టులో సుస్థిర స్థానాన్ని పొందలేకపోయాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో పాటు కీపింగ్ స్కిల్స్ తో చెలరేగిపోయిన ధోనీ, జట్టులో పాతుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం ధోనీ టెస్టు మ్యాచ్ ల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన తరువాత పార్థివ్ తో పాటు దినేష్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా వంటి వాళ్లకు కీపర్ గా అవకాశాలు లభించాయి.
ఇక తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పార్థివ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జట్టులో ఉన్నవేళ బాగా ఆడుంటే, ధోనీ వచ్చేవాడు కాదని అభిప్రాయపడ్డాడు. తాను రాణించక పోవడంతోనే ధోనీ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారని అన్నాడు. ధోనీ తరంలో పుట్టడం తన దురదృష్టమని అందరూ అంటుంటారని, అయితే, ఆ మాటలను పెద్దగా పట్టించుకోబోనని, ధోనీ తరంలో పుట్టడం పొరపాటని అనుకుంటూ సర్దిచెప్పుకోవడం బాగుంటుందని అన్నాడు. ధోనీ ఓ లెజండ్ వంటి ఆటగాడని, ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాడు.