parliament: జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
- జూలై 18 నుంచి ఆగస్ట్10వ తేదీ వరకు సమావేశాలు
- ట్రిపుల్ తలాక్ బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్న కేంద్రం
- విపక్షాలు సహకరించాలన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు జాతీయ ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు, ట్రాన్స్ జెండర్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది.
ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ, ఉభయసభలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల్లో తగినంత బలం లేకపోయినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేసిన యత్నాలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.