airtel: ఆరు నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై ఎయిర్ టెల్ తగ్గింపు ఆఫర్లు
- ఆరు నెలల ప్లాన్ పై 15 శాతం డిస్కౌంట్
- ఏడాది కాల ప్లాన్లపై 20 శాతం తగ్గింపు
- రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభం కానుండడంతో ఎయిర్ టెల్ అప్రమత్తత
ఎయిర్ టెల్ కంపెనీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై తగ్గింపు ధరల్ని ప్రకటించింది. ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే 15 శాతం, ఏడాది ప్లాన్ అయితే 20 శాతం డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ప్రస్తుతమున్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్త కస్టమర్లను రాబట్టుకోవడమే ఆఫర్ల లక్ష్యం. ముఖ్యంగా రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ఆరంభం అవుతున్న నేపథ్యంలో ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం ఎయిర్ టెల్ కు సవాల్ గా మారనుంది.
ఎందుకంటే 100 ఎంబీపీఎస్ వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ ను, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో టీవీ యాక్సెస్ తో నెలకు రూ.1,000లోపు చార్జీకే జియో అందించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎయిర్ టెల్ 300 ఎంబీపీఎస్ ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తుండడం గమనార్హం. కాకపోతే నెలవారీ చార్జీ రూ.2,199గా ఉంది. 1200జీబీ డేటా పరిమితి ఉంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అలాగే, ఏడాది పాటు ప్లాన్ కు సబ్ స్క్రయిబ్ చేసుకుంటే అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.