jagan: మీ అతి తెలివితేటలు మా దగ్గర కాదు.. చేతనైతే ఢిల్లీలో మాట్లాడండి: దేవినేని ఉమామహేశ్వరరావు
- డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి, పోలవరంను నిర్మిస్తున్నాం
- బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను పరిశీలించాలి
- రాష్ట్ర ప్రగతిని చూడలేక జగన్ మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేస్తున్నారు
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలారంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అతి తెలివితేటలు తమ వద్ద ప్రదర్శించవద్దని... మోదీ వద్ద చూపించుకోవాలని అన్నారు. విభజన హామీలు, ప్రాజెక్టుకు నిధుల గురించి... దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా, ప్రాజెక్టు నిర్మాణం ఆగకూడదనే భావనతో అప్పులు తెచ్చి మరీ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 55.73 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతిపక్షాలు దండగ అని విమర్శించిన అన్ని ప్రాజెక్టులకు అవార్డులు వచ్చాయని తెలిపారు.
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావులు ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను పరిశీలించాలని ఉమ సూచించారు. పోలవరంకు సంబంధించిన రెండో డీపీఆర్ ను ఆమోదింపజేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ అధికారులు తిరుగుతున్నారని చెప్పారు. ముంపు మండలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించకపోయి ఉంటే... పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని చూడలేక వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరిట మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.