Andhra Pradesh: ఏపీ డీఎస్సీ పీఈటీ అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావద్దు: మంత్రి గంటా శ్రీనివాసరావు
- నవ్యాంధ్రలో వ్యాయామ విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం
- ఫిజికల్ లిటరసీ పటిష్టంగా అమలు చేస్తాం
- అందుకే, పీఈటీ అభ్యర్థులకు భౌతిక సామర్థ్య పరీక్షలు
నవ్యాంధ్రలో వ్యాయామ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆ క్రమంలోనే పాఠశాలల్లో ఫిజికల్ లిటరసీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, మెరుగైన అభ్యర్థుల ఎంపిక కోసం డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు వారివారి వయస్సును అనుసరించి అత్యంత పారదర్శకంగా భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించి మార్కులు కేటాయిస్తామని చెప్పారు. భౌతిక సామర్థ్య పరీక్షలకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందిస్తున్నామని, ఇప్పుడే అనవసర అపోహలకు లోను కావద్దని అభ్యర్థులకు సూచించారు.
గ్వాలియర్ కేంద్రంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రఖ్యాత లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ జె.పి.వర్మ కమిటీ నేతృత్వంలో గైడ్ లైన్స్ ఈ నెల 29న రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీలో ఆచార్య నాగార్జున యూనివర్శటీ రిటైర్డ్ ప్రొఫెసర్ లు ఏ.వి.దత్తాత్రేయ రావు, ఆర్.ఆర్.ఎల్ కాంతన్, ప్రొఫెసర్ కిషోర్, సభ్య కార్యదర్శిగా టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి వుంటారని, కమిటీ నిర్ణయాల మేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తామని, పారదర్శకమైన రీతిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేలా గైడ్ లైన్స్ వుంటాయని గంటా స్పష్టం చేశారు.
పీఈటీలకు టెట్ నిర్వహణ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్.సి.టీ.ఈ) నిబంధనల మేరకే నిర్వహిస్తున్నామని, ఇది వరకే కేరళ రాష్ట్రం ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి టెట్ నిర్వహిస్తున్న విషయాన్ని గంటా ప్రస్తావించారు. టెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల ప్రతిభా పత్రాలను, అనుబంధ పత్రాలను సంబంధిత ఫెడరేషన్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలకు పంపుతున్నామని, అవి వాస్తవమని నిర్ధారణ అయిన తర్వాత కేటగిరీల వారీగా ఆ మార్కులు రాతపరీక్షమార్కులతో జతచేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి లోపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.