shivaji: టీడీపీకి మద్దతు ఇవ్వడానికి రాలేదు.. కేంద్రంతో అంటకాగేవారిని తొక్కి పడేస్తాం: హీరో శివాజీ

  • కొన్ని పార్టీలు తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర  ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి
  • బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోంది
  • రమణ దీక్షితులుకు శ్రీవారే విశ్రాంతి కల్పించారు
  • కేంద్రంపై పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలి
  • తిరుమలను రాష్ట్రం నుంచి వేరు చేసే కుట్రలు జరుగుతున్నాయి

ఏపీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలసి పోరాడాల్సి ఉందని సినీ నటుడు శివాజీ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరమని చెప్పారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవిలను ఈరోజు ఆయన పరామర్శించారు. దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందని నాలుగేళ్లుగా తాము మొత్తుకుంటూనే ఉన్నామని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఆదుకోవాల్సింది పోయి, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడపకు ఉక్కు కర్మాగారం రాకుండా అడ్డుకుంటున్న బీజేపీ... రాయలసీమ డిక్లరేషన్ తో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందని దుయ్యబట్టారు.

కొన్ని పార్టీలు తమ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని... కేంద్రంతో అంటకాగేవారిని తొక్కి పడేస్తామని శివాజీ హెచ్చరించారు. తిరుమల ఆలయాన్ని రాష్ట్రం నుంచి వేరు చేసే దుర్మార్గపు యత్నాలు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎన్నో సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారికి సేవ చేసిన రమణ దీక్షితులు... పదవి పోగానే టీటీడీపై విమర్శలు చేయడం దారుణమని అన్నారు. ఆయనను ఎవరూ తొలగించలేదని... చేసిన సేవ చాలంటూ శ్రీవేంకటేశ్వరస్వామే ఆయనకు విశ్రాంతిని కల్పించారని చెప్పారు. పదవి పోయిన తర్వాత విమర్శలకు దిగకుండా... శ్రీవారి మహిమల గురించి భక్తకోటికి వివరించే కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే... రమణ దీక్షితులును భక్తులు దేవుడిగా కొలిచేవారని అన్నారు.

తాను టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడకు రాలేదని... ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడ్డ నేతలకు సంఘీభావం ప్రకటించేందుకే వచ్చానని శివాజీ తెలిపారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాల్సి ఉందని చెప్పారు. ఏపీకి రూ. 2 లక్షల కోట్ల అప్పు ఉందంటూ కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వాస్తవానికి రూ. 82 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని తెలిపారు. 

  • Loading...

More Telugu News