DOT: ఒకే ఫోన్ నంబర్ తో మరో టెలికం కంపెనీకి మారడం ఇక కష్టమే... రద్దు కానున్న ఎంఎన్పీ!
- సేవలను నిలిపివేస్తామంటున్న ఇంటర్ కనెక్షన్ టెలికం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్
- డాట్ కు లేఖ రాసిన రెండు సంస్థలు
- ఇతర కంపెనీలకు అవకాశమిస్తామంటున్న డాట్
మన దగ్గరున్న మొబైల్ నంబర్ మారకుండా, మరో సర్వీస్ ప్రొవైడర్ కు మారడం ఇకపై కష్టమే. ఎంఎన్పీ (మొబైల్ నెంబర్ పోర్టబిలిటి) సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ కంపెనీలు ఈ సేవలు వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఆపివేయాలని భావిస్తున్నాయని 'ఎకనామిక్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఎంఎన్పీ చార్జీలను భారీగా తగ్గించడంతో, తాము నష్టపోతున్నామని ఆరోపిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్, ఇదే విషయాన్ని డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం)కు రాసిన లేఖలో స్పష్టం చేశాయట. ఇక ఈ కంపెనీలు తమ సేవలను నిలిపితే ఒక నెట్ వర్క్ లో సెల్యులార్ సేవలందుకుంటున్న కస్టమర్ మరో నెట్ వర్క్ కు అదే నంబర్ తో వెళ్లడం కష్టమే.
ఇదిలావుండగా, ఎంఎన్పీకి గతంలో రూ. 19 వసూలు చేస్తుండగా, దాన్ని 80 శాతం మేరకు... అంటే రూ. 4కు తగ్గిస్తూ టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) గడచిన జనవరిలో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తమకు నష్టాలే వస్తున్నాయని ఇంటర్ కనెక్షన్ టెలికం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఒకవేళ ఈ సంస్థలు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవలను కొనసాగించని పక్షంలో మరో సంస్థకు అనుమతులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని టెలికం శాఖ అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి భారత టెలికం మార్కెట్లోకి జియో ప్రవేశించిన తరువాత టెలికం రంగం దశ, దిశ మారగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి టాటా టెలీ సర్వీసెస్, టెలినార్, ఎయిర్ సెల్ సంస్థలు మూతపడ్డాయి. ఈ కంపెనీల సేవలందుకుంటున్న వారు ఎయిర్ టెల్, జియో, ఐడియాలకు ఎంఎన్పీ రిక్వెస్ట్ లు పెట్టుకుని, ఒక్క మార్చి నెలలోనే 1.96 కోట్ల మంది తమ సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకున్నారు. ఇదే సమయంలో జియోతో పోటీ పడేందుకు ఇతర కంపెనీలు భారీగా టారిఫ్ లను తగ్గించాల్సి వచ్చింది కూడా.