jaipal: ఎన్నికలు కాగానే కేసీఆర్ పని పడతాం: జైపాల్ రెడ్డి
- కేసీఆర్ సవాల్ ను మేము స్వీకరిస్తున్నాం
- ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది
- కేసీఆర్ తనకు తానే తెలివిగలవారనుకుంటారు
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని, ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. రేపు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు కాగానే కేసీఆర్ పని పడతామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనకు తానే తెలివిగలవారనుకుంటారని, అందరినీ మోసం చేయగలడనుకుంటారని అన్నారు. గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని ప్రశ్నించిన ఆయన, ప్రధాని మోదీతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు.
కాగా, ఇటీవల లక్నో పాస్ పోర్ట్ కార్యాలయంలో హిందూ-ముస్లిం దంపతుల పాస్ పోర్ట్స్ ని రెన్యువల్ చేసేందుకు అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు ఆ జంట ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఈ విషయమై సుష్మా స్వరాజ్ పై సొంత పార్టీకి చెందిన నేతలు మాటల దాడికి దిగడంపై జైపాల్ రెడ్డి స్పందించారు.
సొంత పార్టీ నేతలను సైతం బీజేపీ టార్గెట్ చేయడం దారుణమని, మోదీ సామాజిక మాధ్యమ సైన్యం హిట్లర్ సేనను తలపిస్తోందని అన్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా సుష్మా ఉన్నారనే కారణంతోనే ఆమెపై సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక విధానానికి బీజేపీ ముప్పు తెస్తోందని, పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో కేంద్రం చేతులెత్తేసిందని జైపాల్ రెడ్డి విమర్శించారు.