vijay mallya: మోదీకి లేఖ రాశా.. ఇంత వరకు స్పందన లేదు: లేఖ కాపీలను విడుదల చేసిన విజయ్ మాల్యా
- 2016 ఏప్రిల్ 15న మోదీ, జైట్లీలకు లేఖలు రాశా
- బ్యాంకులు నాపై ఎగవేతదారుడు అనే ముద్ర వేశాయి
- తప్పుడు ఆరోపణలతో సీబీఐ, ఈడీలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి
బ్యాంకు రుణాల ఎగవేతకు తనను ప్రచారకర్తగా చిత్రీకరిస్తున్నారంటూ విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. తన చుట్టూ అనవసరమైన వివాదాన్ని రాజేశారని అన్నారు. తన వాదనను వినిపిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు 2016 ఏప్రిల్ 15న లేఖలు రాశానని... అయితే, వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి రాసిన లేఖ ప్రతిని ట్విట్టర్ ద్వారా ఆయన విడుదల చేశారు.
కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వకంగానే తనపై ఎగవేతదారుడు అనే ముద్ర వేశాయని ఈ సందర్భంగా మాల్యా మండిపడ్డారు. సీబీఐ, ఈడీలు నిరాధారమైన ఆరోపణలతో తనపై చార్జిషీట్లు దాఖలు చేశాయని ధ్వజమెత్తారు. తన సొంత కంపెనీలు, గ్రూపు కంపెనీలు, తన కుటుంబం కంట్రోల్ లో ఉన్న కంపెనీల విలువ రూ. 13,900 కోట్ల వరకు ఉంటుందని... బ్యాంకులతో సెటిల్ మెంట్ కు తాను సిద్ధమేనని చెప్పారు.