kala venkatrao: పెండింగులో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సెప్టెంబర్‌లోగా విడుదల చేయాలి: ఏపీ మంత్రి ఆదేశం
- విద్యుత్ అధికారులకు మంత్రి కళా వెంకట్రావు ఆదేశం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ‘ఊర్జా మిత్ర’ ద్వారా విద్యుత్ కోతలపై సమాచారమివ్వండి
- ప్రభుత్వం పట్ల రైతుల్లో నమ్మకం పెరిగింది
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లను సెప్టెంబర్ లోగా అందజేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో కలిగే అంతరాయాలను 'ఊర్జా మిత్ర' యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలియజేయాలన్నారు.
అమరావతి, ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్) అధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలన్నారు. వచ్చే సెప్టెంబర్ లోగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, విద్యుత్ కనెక్షన్ అందజేయాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వరప్రసాదమైన నీటి పారుదల, వ్యవసాయ రంగాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
దీనివల్ల ప్రభుత్వం పట్ల రైతుల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టాలు పెరిగాయన్నారు. రైతాంగం వ్యవసాయ పంపు సెట్లపై ఆధారపడి సేద్యం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు అదనంగా 40 వేల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు.
వీటితో కలిపి మొత్తం ఈ ఏడాది 90 వేల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. వాటిలో ఇప్పటికే 40 వేల వరకు కనెక్షన్లు ఇచ్చారన్నారు. మిగిలిన వాటిని సెప్టెంబర్ లోగా అందజేయాలన్నారు. కనెక్షన్ కావాలనుకునే ప్రతి రైతు నుంచి దరఖాస్తు స్వీకరించాలన్నారు. తీసుకున్న దరఖాస్తులను రికార్డులో నమోదు చేయాలని మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు.
ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వమిస్తున్న 75 యూనిట్ల సబ్సిడీ అంశం బిల్లులో పొందుపర్చాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ ను సరసమైన ధరకు అందించాలన్నది చంద్రబాబు నాయుడి ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ సంస్థ బాగా పనిచేస్తోందని మంత్రి కొనియాడారు.
రెవెన్యూ వసూళ్లు 97 శాతం పెంచామని మంత్రికి ఆ సంస్థ ఎండీ ఎం.ఎం.నాయక్ తెలిపారు. వేసవిని మరపించే విధంగా విద్యుత్ వినియోగం బాగా పెరిగిందన్నారు. 185 మిలియన్ యూనిట్లను వినియోగదారులు వినియోగించారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వివిధ విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి కళా వెంకటరావు సమీక్షించారు. ఈ సమావేశంలో ఇంధన, ఐఅండ్ఐ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ సీతారామరాజు, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వనజ, తిరుపతి జోన్ సీఈ నందకుమార్, విజయవాడ జోన్ సీఈ రాజ్యబాపయ్య, కర్నూల్ జోన్ సీఈ పీరయ్య, తిరుపతి సీజేఎం ఆపరేషన్స్ నరసింహులు పాల్గొన్నారు.