TTD: జీయంగార్ల వేతనాలను భారీగా పెంచిన టీటీడీ.. కోటిన్నరకు చేరిన పెద్ద జీయంగార్ వేతనం!
- రూ. 1.15 కోట్ల నుంచి రూ. 1.50 కోట్లకు పెద్ద జీయంగార్ల వేతనం
- రూ. 1.09 కోట్లకు పెరిగిన చిన్న జీయంగార్ల వేతనం
- వార్షిక వేతనాలు పెంచుతూ టీటీడీ బోర్డు నిర్ణయం
పెద్ద జీయంగార్లు, చిన్న జీయంగార్ల వేతనాన్ని భారీగా పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద జీయంగార్ల వార్షిక వేతనాన్ని రూ. 1.15 కోట్ల నుంచి రూ. 1.50 కోట్లకు, చిన్న జీయంగార్ల వార్షిక వేతనాన్ని రూ. 79 లక్షల నుంచి రూ. 1.09 కోట్లకు పెంచుతున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి బోర్డు ఈ మేరకు అధికారులు, బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామి సర్వ దర్శనం కోసం 18 కంపార్టుమెంట్లలో భక్తులు నిండివుండగా, ఇప్పుడు కంపార్టుమెంట్లలోకి ప్రవేశించే వారికి 16 గంటల తరువాత దర్శనం కలగనుంది. టైమ్ స్లాట్ టోకెన్ తీసుకున్న వారికి 3 గంటలు, నడకదారి భక్తుల దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని, ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు రెండున్నర గంటలు పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ప్రకటించారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు అందిస్తున్నామని తెలిపారు.