kerala: వివాహితను రేప్ చేసిన ఐదుగురు చర్చ్ ఫాదర్లు
- పెళ్లికి ముందు ఓ ఫాదర్ తో సన్నిహితంగా ఉన్న మహిళ
- చేసిన తప్పును చర్చికి వచ్చి మరో ఫాదర్ తో పంచుకున్న బాధితురాలు
- ఆమె తప్పును ఆసరాగా తీసుకుని అత్యాచారాలకు పాల్పడ్డ ఫాదర్లు
చేసిన పాపాన్ని జీసస్ తో చెప్పుకునేందుకు వెళ్లిన ఓ వివాహితను కామాంధులు కాటు వేశారు. ఈ ఘోరం కేరళలో చోటు చేసుకుంది. పెళ్లికి ముందు జరిగిన ఒక పొరపాటును ప్రభువుతో చెప్పుకుని, పాప పరిహారం చేసుకోవాలనుకున్న బాధితురాలు మలంకర ఆర్థొడాక్స్ చర్చ్ కు వచ్చింది. తిరువళ్లకు చెందిన ఈ మహిళ పెళ్లికి ముందు ఓ ఫాదర్ తో సన్నిహితంగా మెలిగింది. పెళ్లైన తర్వాత ఈ తప్పును పదేపదే తలుచుకుంటూ కుమిలిపోయింది.
ఈ నేపథ్యంలో, చర్చికి వచ్చి మరో ఫాదర్ తో చేసిన తప్పును చెప్పుకుంది. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకున్న ఆ ఫాదర్... ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు.... ఆమె తనతో ఉన్న అశ్లీల చిత్రాలను, వీడియోలను మరో ముగ్గురు ఫాదర్లకు పంపాడు. వీరిలో ఒకడు ఢిల్లీలో ఉంటాడు. తదనంతర కాలంలో వీరంతా ఫొటోలను, వీడియోలను ఆమెకు చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు ఫాదర్లు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. వీరంతా కూడా ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆమెతో టచ్ లో ఉంటూ... ఒకరికి తెలియకుండా, మరొకరు సంబంధాలను కొనసాగించారు.
గత ఫిబ్రవరిలో ఈ విషయాన్ని బాధితురాలి భర్త గుర్తించాడు. ఢిల్లీలో ఉన్న ఫాదర్ ఆమెను కలిసేందుకు కొచ్చికి వచ్చాడు. ఆమె డెబిట్ కార్డును ఉపయోగించి ఓ ఫైవ్ స్టర్ హోటల్ లో రూమ్ ను బుక్ చేశాడు. ఆ తర్వాత డెబిట్ కార్డు స్టేట్ మెంటును చూసిన ఆమె భర్త షాక్ కు గురయ్యాడు. భార్యను నిలదీసి అడగడంతో... కొన్నేళ్లుగా అనుభవిస్తున్న నరకం గురించి ఆమె వివరించింది.
అనంతరం ఫాదర్లపై చర్చి నిర్వహణ కమిటీకి భర్త ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిటీ... ఐదుగురు ఫాదర్లను సస్పెండ్ చేసింది. అయితే, ఇంకా విచారణ మాత్రం జరపలేదు. అంతే కాదు పోలీసు కేసు కూడా నమోదు కాలేదు.
ఈ దారుణం గురించి బాధితురాలి భర్త మరొక వ్యక్తితో మాట్లాడుతున్న ఫోన్ సంభాషణ వెలుగు చూడటంతో... మొత్తం వ్యవహారం బయటపడింది. ఫాదర్లను ఆరు నెలల పాటు బిషప్ సస్పెండ్ చేశారని... ఇంతటి చిన్న శిక్షతో తాను సరిపెట్టుకోలేనని చెబుతున్న మాటలు ఆడియో టేప్ లో ఉన్నాయి. అంతేకాదు, జరిగిన ఘటన గురించి తన భార్య పూర్తి వివరాలను చెప్పడం లేదని... ఈ వ్యవహారంలో ఐదు నుంచి ఎనిమిది మంది ఫాదర్లు ఉన్నారని ఆయన చెప్పాడు. చర్చ్ ప్రతిష్టను దెబ్బతీయాలని తాను భావించడం లేదని అన్నాడు. తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ, చర్చికి సంబంధించిన ఎంతో మంది పెద్ద వ్యక్తులు తనపై ఒత్తిడి చేశారని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ అంశం... క్రైస్తవ వర్గాల్లో కలకలం రేపుతోంది.