usa: ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేయండి... భారత్ ను కోరిన అమెరికా
- భారత్, చైనాలకు మినహాయింపు ఉండదు
- అన్ని దేశాల మాదిరే పాటించాల్సి ఉంటుంది
- నవంబర్ 4 నాటికి పూర్తిగా ఆపేయాలి
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను వచ్చే నవంబర్ నుంచి నిలిపివేయాలని భారత్ సహా అన్ని దేశాలను అమెరికా కోరింది. భారత్ కు, భారత కంపెనీలకు మినహాయింపు ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఆ దేశంపై తిరిగి ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ప్రకటించిన విషయం విదితమే.
అమెరికా ఇరాన్ పై విధించే ఆర్థిక ఆంక్షలు ఇతర దేశాల మాదిరే చైనా, భారత కంపెనీలకు కూడా అమలవుతాయని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి నుంచే చమురు దిగుమతులను తగ్గించుకుంటూ నవంబర్ 4 నాటికి పూర్తిగా ఆపేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయా దేశాలకు ద్వైపాక్షిక చర్చల సందర్భంగానూ తెలియజేస్తామన్నారు.