YSRCP: బీజేపీ, వైసీపీ కలసి రహస్యంగా పనిచేస్తున్నాయి: మంత్రి కాల్వ శ్రీనివాసులు
- బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోంది
- బీజేపీతో వైసీపీ లోపాయకారి ఒప్పందం చేసుకుంది
- ఇది చాలా దుర్మార్గమైన చర్య
- వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి
బీజేపీ, వైసీపీ కలసి రహస్యంగా పని చేస్తున్నాయని, అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. కేసుల నుంచి బయటపడటం వంటి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని అన్నారు.
ఆ రెండు పార్టీల ఎజెండా ఒక్కటేనన్నారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందారోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మోదీ గ్రాఫ్ క్షీణిస్తోందని, దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకం కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన మోదీ మదిలో మెదిలిందన్నారు. బీజేపీలోని ముఖ్య నాయకులకు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఈ సమాచారం రహస్యంగా అందజేశారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఇదే అంశంపై నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే ఆయన వారికి రహస్య నాయకుడని తేలిపోయిందని చెప్పారు.
వైసీపీ అండచూసుకొనే రాష్ట్రంలో అధిక ఎంపీ స్థానాలున్న తమ పార్టీని వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు వచ్చే స్థానాలను తమ ఖాతాగా బీజేపీ భావిస్తోందన్నారు. బీజేపీ, జగన్ వేరువేరు కాదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చిన రోజునే రాష్ట్ర ప్రజలు అనుమానించారని చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తరచూ ప్రధాన మంత్రి పేషీకి వెళ్లడం, విలేకరులు చూస్తుంటే నక్కినక్కి ఉండటం వారి లాలూచి వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోందన్నారు.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సమయంలో కూడా వారు ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసని కాల్వ శ్రీనివాసులు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం కూడా వారి మధ్య లోపాయకారీ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. అంతకు ముందు రెండు రోజుల వరకు కన్నా వైసీపీలో చేరుతున్నట్లు ఆయన అనుయాయులు ప్రచారం చేయడం, ఫ్లెక్సీలు పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కన్నా ఆస్పత్రిలో చేరడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగిపోయాయని తెలిపారు.
కన్నా, జగన్ ఎజెండా నిర్ణయించేది ఢిల్లీలోని బీజేపీయేనన్నారు. బీజేపీ నేత కృష్ణంరాజు కూడా సాక్షి టీవీ ఇంటర్వ్యూలో తన మనసులో మాటగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను పొగడటం ద్వారా వారి మధ్య సంబంధాలు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల వారు చంద్రబాబుపై విద్వేషాన్ని పెంచుతూ, రాయలసీమ ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
ఏపీ భవిష్యత్ ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల విషయంలో తమిళనాడులో అందరిదీ ఒకటే మాట అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రమంతటా పర్యటించినటువంటి పరకాల ప్రభాకర్ ని వైసీపీ నేతలు మానసికంగా వేధించారన్నారు.