cuddapah: బీటెక్ రవి దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆసుపత్రికి తరలింపు
- బలవంతంగా రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- అత్యవసర చికిత్స అందించకపోతే ప్రమాదమంటున్న వైద్యులు
- ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తానంటున్న బీటెక్ రవి
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోగ్యం విషమించినట్టు రిమ్స్ వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవి దీక్షను పోలీసులు భగ్నం చేసి, బలవంతంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రవికి అత్యవసర చికిత్స అందించకపోతే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
రవి షుగర్ వ్యాధిగ్రస్తుడని, చికిత్స అందించడం ఆలస్యం చేస్తే ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటుందని వైద్యులు హెచ్చరించారు. మరోపక్క దీక్షా శిబిరం వద్దకు కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తన దీక్షను ఆసుపత్రిలోనే కొనసాగిస్తానని రవి చెప్పడం గమనార్హం. కాగా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి ఎనిమిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. రవి దీక్షను భగ్నం చేయడంతో.. సీఎం రమేష్ తన దీక్షను కొనసాగిస్తున్నారు.