Google: తెలుగు వెబ్సైట్లకు గుడ్ న్యూస్.. వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు గూగుల్ రెడీ!
- హిందీ, బెంగాలీ, తమిళ భాషలకు ఇప్పటికే యాడ్స్
- ఇప్పుడు తెలుగు వెబ్సైట్లకు కూడా..
- భారతీయ భాషల్లో వెబ్సైట్లు చూస్తున్న 23.4కోట్ల మంది
తెలుగు వెబ్సైట్ల నిర్వాహకులకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. ఇకపై ప్రాంతీయ భాషలకూ వాణిజ్య ప్రకటనలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే హిందీ, బెంగాలీ, తమిళ భాషల వెబ్సైట్లకు ఈ వెసులుబాటు ఉండగా ఇప్పుడు తెలుగుకు కూడా అది అందుబాటులోకి వచ్చింది. గూగుల్ నిర్ణయం వల్ల తెలుగు డిజిటల్ మీడియా నిర్వాహకులకు అదనంగా రాబడి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, గూగుల్ యాడ్సెన్స్, యాడ్వర్డ్స్ ద్వారా ప్రకటనలు ఇచ్చే వారికి కూడా దీనివల్ల ప్రయోజనం కలగనుందని గూగుల్ దక్షిణాసియా, భారత్ ఉపాధ్యక్షుడు రాజన్ ఆనంద్ తెలిపారు.
బుధవారం ఆయన ‘గూగుల్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగులో బ్లాగులు, వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారు యాడ్సెన్స్లోకి లాగిన్ అవడం ద్వారా ప్రకటనలు పొందవచ్చన్నారు. ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్ ఆధారంగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతీయ భాషల్లో వెబ్సైట్లు చూస్తున్న వారి సంఖ్య 23.4కోట్లకు చేరుకుందని మార్కెట్ సొల్యూషన్స్-ఇండియా డైరెక్టర్ శాలినీ గిరీశ్ పేర్కొన్నారు. 2021 నాటికి వీరి సంఖ్య 53.6కోట్లకు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.