Aruna miller: ప్చ్.. మేరీల్యాండ్ ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగమ్మాయి
- ప్రత్యర్థి ట్రోన్ చేతిలో 5,544 ఓట్ల తేడాతో ఓటమి
- రెండో స్థానంతో సరిపెట్టుకున్న తెలుగమ్మాయి
- ప్రచారంలో కొత్త ఒరవడి సృష్టించానన్న అరుణ
కాట్రగడ్డ అరుణా మిల్లర్.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆరో కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎన్నికలో బరిలోకి దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలుగమ్మాయి. ఆమె గెలుపు ఖాయమని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి, అపర కుబేరుడు అయిన డేవిడ్ ట్రోన్ చేతిలో 5,544 ఓట్ల తేడాతో అరుణ ఓటమి పాలయ్యారు. బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులుండగా మిల్లర్ 17,311 ఓట్లతో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈ ఎన్నికల్లో ట్రోన్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడమే ఆయన విజయానికి కారణమని తెలుస్తోంది. తాను ప్రచారంలో డబ్బులు పంచలేదని పేర్కొన్న మిల్లర్.. తన ప్రచారం కొత్త ఒరవడికి నాంది అని చెప్పారు.
2016 ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రోన్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తొలి నుంచీ పట్టుదలగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు చేశారు. అరుణ మిల్లర్ ఖర్చు చేసింది కేవలం రూ.16 కోట్లే. కాగా, ప్రైమరీలకు పోటీ పడిన మరో ఐదుగురు భారత సంతతి అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు.